ఏపీలో కొలువుల జాతర.. పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ

అమరావతి, సెప్టెంబర్16(క్విక్ టుడే న్యూస్):
ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్లు (SI), పోలీస్ కానిస్టేబుళ్లు (PC), ఫైర్‌మెన్, జైలు వార్డర్లు, ఫోరెన్సిక్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోలీసు శాఖలో మొత్తం 438 ఎస్సై పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో సివిల్ విభాగంలో 253, ఆర్మ్డ్ రిజర్వ్‌లో 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లో 9, కమ్యూనికేషన్ విభాగంలో 50, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (PTO)లో 10 పోస్టులు ఉన్నాయి. అలాగే 1,156 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో సివిల్ విభాగంలో 542, ఆర్మ్డ్ రిజర్వ్‌లో 285, ఫైర్ విభాగంలో 158, జైలు వార్డర్ పోస్టులు 171 ఉన్నాయి. జైలు వార్డర్ పోస్టుల్లో పురుషులకు 150, మహిళలకు 21 పోస్టులు కేటాయించారు.
పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. PTO విభాగంలో 15 మెకానిక్, 198 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో ఫిజిక్స్‌లో 10, కెమిస్ట్రీలో 13, బయాలజీ/సెరాలజీలో 20 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, దరఖాస్తు తేదీలను APSLPRB అధికారిక నోటిఫికేషన్లో వెల్లడించనుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. అభ్యర్థులు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.




